Saturday, October 11, 2014

దివ్య ప్రణయనందనంలో విరిసిన సుమధుర పారిజాతం ఈ గీతం!!




శ్రీ వేంకటేశ్వరుడు కలియుగదైవం అంటారు. అందుకే కాబోలు  తనకి నచ్చిన కన్యను ప్రేమించి వివాహం చేసుకుని, గొప్ప ప్రేమికుడిగా నిలిచి కలియుగలక్షణాన్ని తనలోనే చూపించాడు.  శ్రీ వేంకటేశ్వరుని మహాత్మ్యం అనే పేరుతో వేంకటేశ్వరుని కథ అందరికీ తెలిసినదే అయినా మరోసారి చెప్పుకుందాం.  భృగుమహర్షి శాపానికి ఫలితంగా మహావిష్ణువు భూమిమీద అవతరించవలసి వచ్చింది. తన భర్తను భృగుమహర్షి తన వాస స్థానమయిన గుండెలమీద పాదంతో తన్ని,తనని అవమానించినా అతనిని ఆదరించినందుకు కోపం తెచ్చుకుని తనకు గౌరవం లేని వైకుంఠంలో తానుండలేనంటూ పుట్టింటికి ప్రయాణం అయింది.శ్రీలక్ష్మి లేని వైకుంఠంలో తానూ ఉండలేక మహర్షి శాప ఫలితంగా  భూలోకానికి చేరాడు మహా విష్ణువు- శ్రీనివాసుడుగా. కృష్ణావతారంలో పరమాత్ముడికి తల్లిగా ఎన్నో ముచ్చటలు తీర్చుకున్నా తన చేతులమీదుగా అతని పెళ్ళి జరగలేదని కినుకవహించిన యశోదకి మరో అవతారంలో ఆ ముచ్చటతీర్చుతానని వరం ఇచ్చాడు కృష్ణయ్య.ఆ యశోదే వకుళమాలగా జన్మించింది. మతిమాలి తిరుగుతూ వకుళమాల వద్దకు చేరి ఆమెనుంచి కన్నతల్లి ఆదరణను పొందాడు శ్రీనివాసుడు.   

చంద్రవంశానికి చెందిన సుధర్ముడు అనే రాజు కొడుకు ఆకాశరాజు. ఎంతోకాలం సంతానం లేకపోవడంతో యజ్ఞం చేయాలనుకుని భూమిని సిద్ధం చేస్తూ ఉండగా ఒక పద్మంలో ఆడిపిల్ల కనిపించింది. పద్మంలో దొరకడంవల్ల పద్మావతి అని పేరు పెట్టుకుని ఎఁతో అపురూపంగా, కన్నకూతురులా పెంచుకున్నారు ఆకాశరాజు దంపతులు. ఆమె యుక్తవయసుకి వచ్చింది. ఒకనాడు వనవిహారం చేస్తూ అనుకోకుండా శ్రీనివాసుడిని చూసింది. శ్రీనివాసుడు కూడా పద్మావతిని చూసాడు. ఇరువరి కళ్లు కలవగానే జన్మాంతర సౌహార్ద్రం వారి హృదయాలలో వెల్లి విరిసింది. కొద్ది క్షణాలు ఒకరికనులలోకి ఒకరు చూసుకున్నారు. అంతలోనే దూరమయ్యారు. వారి శరీరాలు దూరమయ్యాయి కానీ హృదయాలు కనులు కలుసుకున్నప్పుడే ఏకమయ్యాయి.

ఈ సందర్భంలోనే  ఈ పాట. 
కావ్యాలలో నాయికా నాయకులు సామాన్యులు, దివ్యులు అనే భేదంతో కనిపిస్తారు. దివ్యులు అంటే దేవతలు అన్నమాట. సామాన్యులు అంటే భూలోకంలో ఉండే మానవులు. ఇక్కడ కథ భూలోకంలో జరుగుతోంది కనుక సామాన్యులుగా కనిపించినా నిజానికి ఈ ఇరువురు దివ్యులు. ప్రేమాతిశయాన్ని, విరహాన్ని వర్ణించడానికి కవి ఎంత అందమైన పదాలను ఈ పాటలో ప్రయోగించారో చూద్దాం.

పద్మావతీదేవి ఒంటరిగా తన తోటలో విహరిస్తోంది. ఉదయం తాను చూసిన శ్రీనివాసుని రూపం మనసులో గాఢంగా ముద్రించుకుంది. అతనిమీద తన మనసులో  అమేయంగా, అప్రమేయంగా కలుగుతున్న ఈ ప్రేమభావాలను ఎలా అర్థం చేసుకోవాలో తెలియక కల్లోలమైన హృదయంతో చలించిపోతోంది పద్మావతి. తన మనసుని హరించిన ఆ నవమన్మథుడు ఎవరో ఎక్కడివాడో, ఎక్కడికి వెళ్ళాడో ఏమీ తెలియనితనంతో అతనిని తిరిగి ఎలా చూడాలో తెలియక తపించింది పద్మావతి.

           ఎవరో....అతనెవరో...ఆ నవమోహనుడెవరో..
            నా మానసచోరుడు ఎవరో..??!!
            తొలిచూపులలో వలపులు చిలికి 
            దోచిన మగసిరి దొర ఎవరో ......
            అరయక హృదయము నర్పించితినే 
            ఆదరించునో –   ఆదమరచునో " 
తొలిసారిగా చూసిన చూపులతోనే మనసుని తననుంచి దొంగిలించాడు. అనుమతిలేకుండానే  తన మనసుపై వలపును చిలికాడు. దొంగతనమే అయినా దొర లాగే దర్జాగా  తీసుకున్నాడు. అతనిని చూసిన మోహావేశంలో తన గురించి అతని భావమేమిటో తెలుసుకోకుండానే తన హృదయాన్ని అతనికి  అర్పించుకున్నందుకు తనకి ఆశాభంగము చేస్తాడేమో అని పద్మావతి బాధ పడుతుంది.  శ్రీనివాసుడు అంటే విష్ణువు అవతారమే కదా. శ్రీకృష్ణుడికి వెన్నదొంగ అని పేరు. అందరి ఇళ్లలోనూ వెన్నని దొంగతనం చేసినా అతనిని అందరూ దొరగానే కొలిచారు. ఆ విషయాన్ని పరోక్షంగా పద్మావతి మాటల్లో పలికించారు కవి. తన మనసును దోచిన శ్రీనివాసుడికి వెన్నదొంగతో సాపత్యం ఎంతో ఉచితమేగా.

అతని రూపు రేఖా విలాసాలను పదే పదే తలచుకుంటుంది. కొద్ది క్షణాలు మాత్రమే చూసిన అతని రూపును మరల మరల మనసులోనే చిత్రించుకుంటుంది.

         వలరాజా……?   కలువలరాజా…..? 
          కాదే !! కన్నుల కగుపడినాడే!!

          అకలంకుడే  - హరిణాంకుడు కాడే 
           మరి ఎవరో……….. ఏమైనాడో ?!

 అంటూ అతనిగురించి  ఊహించుకుంటుంది. నచ్చిన ప్రియుడి రూపాన్ని వర్ణించినప్పుడు ఇంద్రుడు, చంద్రుడు,మన్మథుడు అంటూ అద్భుతమైన అందచందాలుగల పురుష మూర్తులుగా వీరితో పోల్చడం మన కావ్య సంప్రదాయం. ఇక్కడ పద్మావతి కూడా తను మెచ్చిన ఆ యువకుడి రూపాన్ని ఊహించుకుంటుంది. వలరాజా అని ప్రశ్నించుకుంటుంది. వలరాజు అంటే మన్మథుడు. అతను వలరాజేమో అందుకే అంత అద్భుతసౌందర్యంతో ఉన్నాడు అనుకుంటుంది. కానీ మన్మథుడు శివునిపై మన్మథబాణాలు వేసి తాపము పుట్టించాలనుకుని భంగపడి అనంగుడయ్యాడు. అంటే శరీరం లేనివాడయ్యాడు. ఈ శ్రీనివాసుడు సజీవంగా తన కన్నులకి అగుపడ్డాడు. కాబట్టి అతను మన్మథుడు-వలరాజు కాదన్నమాట. అయితే  కలువలరాజు చంద్రుడేమో అనుకుంది. కానీ చంద్రుడు అయితే అతనిలో మచ్చ ఉంటుంది. తను ప్రేమించిన ఈ శ్రీనివాసుడు అకలంకుడు. ఆ చంద్రుడిలా (హరిణాంకుడు-హరిణం అంటే జింక-చంద్రుడిలో కనిపించే మచ్చ జింకరూపంలో ఉంటుందని భావిస్తారు)మచ్చ ఉన్నవాడు కాదు.  మరి ఎవరో అతను, ఎవరో ఏమైనాడో అంటూ మళ్ళీ ఆలోచనలోపడుతుంది పద్మావతి.

వలరాజు, కలువలరాజు ఇద్దరూ లోపాలు ఉన్నవారే. ఒకరికి శరీరం లేదు, ఇంకొకరికి శరీరంలోనే పెద్ద కళంకం ఉంది. కాబట్టి లోకంలో అందగాళ్ళనుకునే అందరికన్నా అందమైనవాడు తాను వలచినవాడు. అలాంటి వ్యక్తిని తాను వరించినందుకు ఓ పక్క సంతోషం, అతను ఏమయ్యాడో తెలియనందుకు విచారంతో, విరహంతో  పద్మావతి మనసు డోలాయమానమయింది.

ఇది పద్మావతి స్థితి. అక్కడ శ్రీనివాసుడు కూడా పద్మావతి విరహంలో తలమునకలయి ఉన్నాడు. 

              ఎవరో.... తానెవరో.....ఆ నవమోహిని ఎవరో .........??!!

అనుకుంటూ తాను వనవిహారం చేస్తున్నప్పుడు  చూసిన ఆ యువతి ఎవరో ఊహించడానికి ప్రయత్నిస్తున్నాడు శ్రీనివాసుడు.
           నందనవనమానందములో తొలిసారిగ పూచిన పూవో -

           తొలకరి యవ్వనమొలికిన నవ్వో

           మనసిచ్చినదో -    నను మెచ్చినదో -  ఆ జవ్వని         
           ఎవరో తానెవరో ... ఆ నవమోహిని ఎవరో 
           మానసహారిణి ఎవరో ....తానెవరో.

నందనవనం అంటే స్వర్గలోకపు ఉద్యానవనం. అద్భుతమైన ఆహ్లాదం, మనసుకి శాంతి కలిగించే సుందర వనం. అటువంటి వనంలో తొలిసారిగా ఓ పూవు పూస్తే  ఆ పూవు ఎంత సుకుమారంగా, ముగ్ధంగా, పరిమళభరితంగా ఉంటుందో సరిగ్గా అలాంటి పూవులా ఉంది తాను చూచి వలచిన ఆ చిన్నది అనుకుంటాడు. అతి సుందరమైన ఆమెని తలచుకుంటే - అప్పుడప్పుడే యవ్వన చిహ్నాలు కనిపిస్తూ బాల్యం నీడలు వీడి  యవ్వనపు కాంతి  తొంగిచూస్తున్న మోములో ముగ్ధమనోహరంగా ఒలికిన నవ్వు జ్ఞాపకం వచ్చింది అతనికి. అంత అందాలరాశి తనను చూసింది. మరి తను ఆమెకి నచ్చాడో లేదో, ఆమె తనని మెచ్చిందో లేదో, మనసిచ్చిందో లేదో  అని పరి పరివిధాల తలపోస్తూ ఉంటాడు శ్రీనివాసుడు. మరి ఈ ఇరువురి కలయిక ఎలా ఎప్పుడు అనేది చిత్రంలో చూడాలి.

నాయికానాయకులుగా దివ్యులయిన శ్రీ వేంకటేశ్వరుడు, పద్మావతిల మధ్య ప్రణయాన్ని, వారి మధ్య విరహాన్ని అతి లలితమైన పదాలతో ఎంతో మధురంగా వర్ణించారు కవి. దివ్యులు కనుకే వారికి జన్మాంతరంలో పరిచయమైన మన్మథుడు, చంద్రుడు గుర్తు వచ్చారు పద్మావతికి. అలాగే శ్రీనివాసుడికి స్వర్గలోకంలో ఉండే నందనవనం సౌందర్యం కూడా పరిచయమే కనుక పద్మావతిని అక్కడి పుష్పంతో పోల్చుకున్నాడు.  కవికి పురాణాలతో గల పరిచయం వల్ల  ఈ వర్ణన సాధ్యమైంది. ముఖ్యంగా  వలరాజా, కలువలరాజా,  కాదే కన్నులకగుపడినాడే అనే వాక్యంలోనూ, నందనవనమానందములో తొలిసారిగ పూచిన పూవో అనే వాక్యాలలోనూ కవి చతురత, పదచాలనం మనసును ఎంతో ఆనందపరుస్తుంది. పౌరాణిక పాత్రలు కాబట్టి వారి భావాలను గంభీరమయిన సరళగ్రాంథికంలో వెల్లడించడం పాటకు ఎంతో ఔచిత్యాన్ని సంతరించింది.


ఈ చక్కని సొంపైన సాహిత్యాన్ని ఎంతో మధురంగా స్వరపరిచారు పెండ్యాల నాగేశ్వరరావుగారు. దివ్యశృంగార రసాభినయంతో   వేంకటేశ్వరుడిగా తెరమీద ఎన్.టి.రామారావు, పద్మావతిగా సావిత్రి ఈ పాటలో కనులవిందు చేస్తారు. అలౌకికమైన ఆనందలోకపు అంచుల్లోకి ప్రవేశించాలంటే ఓసారి ఈ పాట వినాలండి మరి.
 చిత్రం               శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం
 గీతరచన            ఆచార్య ఆత్రేయ
సంగీతం              పెండ్యాల నాగేశ్వరరావు
గాయనీ గాయకులు ఘంటసాల, సుశీల. 1960లో ఈ చిత్రం విడుదలైంది.






Sunday, September 28, 2014

అందాలు చిందే జాబిలి - నవ్వులొలికే తారకల తొలి ప్రేమగీతం

 ఓ తారకా................. ఓ జాబిలీ ..........గీతం చాలా పాతదే.
చండీరాణి చిత్రంలోనిది  ఈ గీతం. 1953 ఆగస్టులో విడుదలైంది చండీరాణి. అరవైసంవత్సరాలు పూర్తిచేసుకున్నా ఈ పాట  నాణ్యతలోను, మాధుర్యంలోను అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది.  ఘంటసాల, భానుమతి - ఈ ఇద్దరూ కలిసి పాడిన యుగళగీతాలు తక్కువే అయినా ఆ ఆణిముత్యాలలో ఇదీ ఒకటి.

చండీరాణి కథలో కథానాయికను తారకగాను, కథానాయకుడిని చంద్రుడిగానూ ఉపమిస్తూ శ్రీ సముద్రాలరాఘవాచార్యులుగారు రచించిన గీతం ఇది.

 తారా చంద్రులు పౌరాణిక పాత్రలు. గురుపత్నిని మోహించినందుకు అపఖ్యాతిని కళంకం రూపంలో మూటగట్టుకుని మోసినా గొప్ప ప్రేమికుడిగా చంద్రుడు వాసికెక్కాడు. చంద్రుడి అందచందాలకు దాసియై అతని ప్రేమకోసం భర్తను, సంసారాన్ని వదులుకున్న తార కూడా మరి గొప్ప ప్రేయసే  కదా. ఇలా తారాచంద్రులు ప్రేయసీ ప్రియులుగా జగత్ప్రసిద్ధులే. లోకంలో అందమైన జంట అంటే తారాశశాంకులే అనిపించుకున్నారు.

తార,  తాను వివాహిత అయినా ఆ బంధాన్ని వదులుకొని చంద్రుడిని ప్రేమించడానికి కారణం అతని అపురూపమయిన అందచందాలే. తమ బంధం లోకామోదం పొందనిదని తెలిసినా తార సౌందర్యానికి, ఆమె వలపు పిలుపుకు పరవశించి ఆమె ప్రణయానికి దాసుడయ్యాడు చంద్రుడు. చిత్రంలో నాయకుడు సామాన్యుడు. నాయిక అతని స్థాయికి అందనిదే. కానీ వలపులుకురిపించే తారక  ప్రేమ చిహ్నాలను, ఆహ్వానాలను ఆమె నవ్వులలో చూసిన చంద్రుడు ఆమెను అనుసరించాడు.  నాయికానాయకులలో ఈ తారాచంద్రుల ప్రణయావస్థను ఆపాదించారు గీతరచయిత
ఓ.............తారకా.........................ఓ.........
ఓ ............జాబిలీ......................ఓ.......

 గీతం ప్రారంభంలో  కథానాయకుడు "ఓ తారకా................" అంటూ వెతుకుతూ  వస్తే " ఓ జాబిలీ......" అంటూ  ముసి ముసి నవ్వులతో ప్రతిస్పందిస్తుంది నాయిక. తనను చూసి నవ్వుతున్నందుకు కారణం ఏమిటని అనుమానంగా ప్రశ్నించాడు నాయకుడు.  "అందాలు చిందెడు చందమామ నీవని ", ఆ భావంతోనే మురిసిపోతున్నాను అంటూ నాయిక జవాబు చెప్తుంది.

"విను వీధిలోనీ  తారా కుమారీ -    దరిజేరనౌనా ఈ చందమామా"
 తారాచంద్రులు ఎప్పుడూ ఆకాశంలో కలిసే కనిపిస్తారు. వారి కలయికకు ఏ ఆటంకం లేదు. కానీ ఇక్కడ కథానాయిక రాజకుమారి. నాయకుడు సామాన్యుడు. ఆమె తనకు అందనంత దూరంలో వినువీధిలో ఆకాశం అంత ఎత్తులో  ఉంది. ఆమెతో కలయిక తనకు సాధ్యమవుతుందా అని సందేహిస్తాడు.
"చేరువె తారా రేరాజుకూ  ........ ఆతారకా...."
కానీ తారాచంద్రులు ఆకాశంలో ఎప్పుడూ కలిసే ఉంటారని ఆ తారాచంద్రుల్లాగే తమ కలయిక కూడా తథ్యమని ప్రియురాలు నమ్మకంగా చెప్తుంది.
 "మనోగాథ  నీతో నివేదించలేను
   నివేదించకున్నా జీవించలేను " -
తన ప్రేయసితో తనమనసులో ఉదయించిన ప్రేమభావనలను పంచుకోవాలని అనుకుంటాడు నాయకుడు. కానీ ఆమె తనగురించి, తన ప్రేమగురించి ఏమనుకుంటుందో తెలియకుండా తన మనసుని చెప్పడం మంచిదికాదేమో అని సందేహిస్తాడు. చెప్పాలా చెప్పవద్దా అనే డోలాయమాన స్థితిలో ఊగిసలాడుతుంది అతని హృదయం. కానీ అతను ఇలా చెప్పీ చెప్పనట్టు చెప్పిన విషయాలన్నీ అతని కళ్ళలోనే తెలుసుకుంది ఆ ప్రేయసి.
" నెరజాణవేలే ............ ఓ జాబిలీ "
అనే మాటతో  ఆమె తనకు  అతని మనసు అర్థమైందనే సంకేతాన్నిస్తుంది.

"తొలి చూపులోని సంకేతమేమో
చెలి నవ్వులోని ఆ శిల్పమేమో" -

ప్రేమికుల మధ్య తొలిచూపుకి ఎంతో ప్రాముఖ్యం ఉంది. యువతీయువకుల మధ్య తొలిచూపులోని ఆ గాఢతే వారిలో ప్రేమగా పర్యవసిస్తుంది. వారిమధ్య సామాజికంగా, ఆర్థికంగా స్థాయీ భేదాలెన్ని ఉన్నా ఒకరికొకరు అనుకుని జీవితాంతం ప్రేమబంధంతో పెనవేసుకోవడానికి పునాది తొలిచూపే. నాయిక తొలిచూపులోని సంకేతాన్ని గ్రహించాడు. తనను అందుకోమని పిలిచే ఆమె హృదయపు ఆహ్వానాన్ని గ్రహించాడు.  పరవశింపజేసే ఆమె నవ్వులలోని ఆంతర్యాన్ని ఊహించుకున్నాడు. కానీ మరొకసారి ఆమె మాటలలో తెలుసుకోవాలనుకున్నాడు.
అందమైన ఆ చందమామలాంటి సౌందర్యంతో వెలిగిపోతున్న తన ప్రియుడి చిలిపి నవ్వులకి జవాబే తను చిందించే నవ్వులని కొంటెగా జవాబు చెప్తుంది నాయిక. అందాలు చిందే చందమామే తనని మెచ్చే, తనకి నచ్చే  ప్రియతముడయినందుకు   మరింతగా మురిసిపోతూ, మురిపెంగా నగవులు చిందిస్తూ చెప్పిన ఆమె సమాధానం విని సంతోషంగా ఆమెని చేరుకుంటాడు ప్రియుడు.

ఈ పాటలో  చరణాలలో మాటలు చాలా తక్కువ. సాధారణంగా పల్లవి తరువాత ఒకటో రెండో చరణాలు ప్రతి చరణం చివర పల్లవి ఆవృతం గా రావడం అనేది సినిమా పాటల్లో కనిపిస్తుంది. కానీ ఈ పాటలో ప్రతి చరణంలోను ఏదో ఒకమాట లేదా వాక్యం వెంటనే పల్లవి పదే పదే పునరావృతం అవుతూ ఉంటుంది. ఆ పల్లవి కథానాయకుడు ఆలపించినప్పుడు "నవ్వులేలా..... ననూ గనీ"  అంటూ సాగుతుంది. కథానాయిక అతని ప్రశ్నకి జవాబుని ఒక వాక్యంలో చెప్పి  అతని సౌందర్యాన్ని చూసి మురిసిపోతూ సంతోషంగా నవ్వుతున్నాను కానీ వేరే అర్థం లేదు అన్నట్టుగా "అందాలు చిందెడి చందమామ నీవని ఆ తారకా నవ్వునోయి నినూగనీ" అంటూ పల్లవిని ఆలపిస్తుంది. చరణాలలో అతి తక్కువమాటలున్నా అనంతమైన భావాలను పలికించే గాయనీ గాయకుల గాత్రమాధుర్యం వీనులకు విందుచేస్తుంది.

తెరమీద ఎన్టీ రామారావుగారు, భానుమతిగారు ఈ గీతానికి నాయికా నాయకులుగా అభినయం చేసారు. ఒకరినొకరు తాకకుండా కేవలం ముఖ కవళికలతో, హావభావాలతో ప్రేమాభిమానాలను ఎంత అద్భుతంగా అభినయించారో  తొలి ప్రేమలో ఒలికే శృంగారరసావిష్కరణను  చూసి తీరవలసినదే.

చండీరాణి చిత్రానికి సంగీత దర్శకత్వం వహించిన సుబ్బురామన్ గారు సినిమా సగంలో ఉండగానే జబ్బుపడి మరణించారు. అతని అసిస్టెంటుగా ఉన్న ఎం.ఎస్ విశ్వనాథన్ గారు ఈ చిత్రంలో పాటలకు సంగీత దర్శకత్వ బాధ్యతను తీసుకుని పూర్తిచేసారు. తెలుగు తమిళం, హిందీ భాషల్లో ఈ సినిమాని నిర్మించారు భానుమతి. తెలుగులో తొలి మహిళా దర్శకురాలిగా కూడా రికార్డు సాధించారు ఆమె.
ప్రేమగీతాలలో ఓ ఆణిముత్యం ఈ పాట....
ఆణిముత్యాలకు అవ(అవి)ధరించడానికి  దేశ కాలాల పరిధి లేదుకదా.

 చిత్రం        చండీరాణి
పాట రచన   సముద్రాల రాఘవాచార్య
  గానం       ఘంటసాల, పి. భానుమతి
సంగీతం      ఎం.ఎస్. విశ్వనాథన్
పాట సాహిత్యం :

                ఓ.............తారకా................ఓ.........
                ఓ ............జాబిలీ................ఓ.......
అతడు    ఓ తారకా నవ్వులేలా ననూ గనీ.......
           ఓ తారకా నవ్వులేలా ననూగనీ.................
           ఓ తారకా నవ్వులేలా ననూగనీ
ఆమె      అందాలు చిందెడీ చందమామ నీవనీ 
            అందాలు చిందెడీ చందమామ నీవనీ
            ఓ జాబిలీ ....ఓ.....ఆ తారకా నవ్వు నోయీ నినుగనీ.......
అతడు     విను వీధిలోనీ  తారా కుమారీ దరిజేరనౌనా ఈ చందమామా
ఆమె       చేరువెకాదా రేరాజుకూ ఆ తారక నవ్వునోయీ నినుగనీ   
             అందాలు చిందెడీ చందమామ నీవని
             ఆ తారకా నవ్వునోయీ నినుగని
అతడు      మనోగాథ  నీతో నివేదించలేను
             నివేదించకున్నా జీవించలేను
 ఆమె       నెరజాణవేలే ఓ జాబిలీ ఓ....ఆ తారక నవ్వునోయి నినుగని
              అందాలు చిందెడి చందమామ నీవని
             అందాలు చిందెడి చందమామ నీవని 
             ఆ తారక నవ్వునోయి నినుగని
అతడు     తొలిచూపు లోని సంకేతమేమో
             చెలి నవ్వులోని ఆ శిల్పమేమో
ఆమె        నీ నవ్వు వెన్నెలే ఓ జాబిలీ 
              ఆ తారక నవ్వునోయి నినుగని
              అందాలు చిందెడి చందమామ నీవని 
              ఆ   తారకా  నవ్వునోయి నినుగని.