Sunday, April 22, 2012

శీలంవారి అబ్బాయి -గండువారి అమ్మాయి!!



పలనాటి పౌరుషాన్ని వెల్లడించే గొప్ప వీరగాథ,  తెలుగునాట ఇంచుమించు మహాభారతానికి   ఉన్నంత  ఆదరణ పొందిన    గాథ -            
పల్నాటివీరగాథ.
 బ్రహ్మనాయుడు, నాగమ్మల మంత్రతంత్రాంగంతో పలనాటిసీమలో నెత్తుటేరులు పారాయి.  మహా భారతంలో అభిమన్యుడిని తలపించే పాత్ర పలనాటి వీరగాథలో బాలచంద్రుడు.
లేతవయసులోనే యుద్ధసీమలో కొదమసింగంలా ముందుకురికి శత్రువులను నాశనం చేసి తన సోదరికి  ఆత్మశాంతి కలిగించిన బాలచంద్రుడు లేనిదే పల్నాటి యుద్ధమే లేదు. అతని భార్య మాంచాల. ఆంధ్రుల ఆడపడుచుగా నేటికీ పౌరుషానికి అభిమానానికి పెట్టింది పేరుగా  చెప్పుకునే గొప్పపేరు మగువ మాంచాల పాత్ర. 


చారిత్రక వ్యక్తులైన ఈ ఆలుమగలు  "పల్నాటి యుద్ధం" చిత్రంలో ఓ సన్నివేశంలో ఏవిధంగా సంభాషించుకున్నారో, ఆ చమత్కారం ఏమిటో ఆ సాహిత్యపు సొబగులేమిటో ఈ గీతంలో విందాం.







గండుకన్నమ వంశస్థురాలు,  రేఖాంబ కుమార్తె మాంచాల.
 శీలమ్మ, దొడ్డనాయుడు ల కుమారుడు బ్రహ్మనాయుడు. బ్రహ్మనాయుడు, ఐతాంబల ఏకైక కుమారుడు బాలచంద్రుడు. బాలచంద్రుడికి  మాంచాలకి వివాహం జరిగింది. వివాహం జరిగి  చాలా కాలం అయ్యాక  బాలచంద్రుడు భార్య మాంచాలను కలుసుకొనేందుకు అత్తగారింటికి వచ్చాడు. అదీ ఈ పాట సందర్భం.

"శీలముగలవారి చినవాడా
 చిగురంత దయలేని మొనగాడా
నిను నమ్మి కన్నె నిచ్చుకున్న వారి ఇంటికి దారి 
ఈ నాటికి తెలిసినదా...
చినవాడా మొనగాడా"

పెళ్ళిజరిగి ఇంతకాలమయినా బాలచంద్రుడు తనను చూడడానికి రాలేదని మాంచాల మనసు తల్లడిల్లుతోంది. అతని జ్ఞాపకాలతో కాలం గడుపుతూ ఉన్నది ఇంతకాలం. కానీ అతనేమో తనని మరిచాడు. నన్ను మరిచిపోయావా అని సూటిగా భర్తను అడగకుండా "నిను నమ్మి కన్యాదానం చేసిన వారి ఇంటి దారి మరిచిపోయావా" అని బాలచంద్రుడు తనను నిర్లక్ష్యం చేయడం వలన ఎంత బాధ పడుతోందో  వెల్లడించింది.
శీలము గలవారి చినవాడా అంటూ భర్తని సంబోధించడంలో అతని వంశాన్ని ప్రశంశిస్తూ, చిగురంత దయలేని మొనగాడా అంటూ బాలచంద్రుడు ఎంత మొనగాడయినా తనమీద మాత్రం చిగురంత దయకూడా చూపలేదంటూ తన వేదనని ఆ సంబోధనలో ఇమిడ్చి ఇలా అంటుంది.

లేత జవ్వని, తన ధర్మపత్ని మాంచాల ఆవేదనను గ్రహించాడు బాలచంద్రుడు. ఆమె మనసులో తనపట్ల ఆరాధనను తెలుసుకున్నాడు. అంతే కాదు, ఆ మాంచాల, రూపంలో ఎంత స్నిగ్థంగా, నాజూకుగా కనిపించినా ఆమె మనసులోని విషయాన్ని అంతకన్నా నాజూకుగానే  అయినా మనసులో నాటకునే మాటలతో తెలియజేయగల నెరజాణ కూడా అని గ్రహించాడు. 

మాంచాల గండు వారి వంశానికి చెందిన ఆడపడుచు.  రేఖాంబ ఏకైక సంతానం, ముద్దులపట్టి. అందుకే ఇలా సంబోధించాడు.
"గండువారి గారాబాల గద్దఱి
 చినదానా- గారాల చినదానా" అంటూ.
గండు అనే పదం ఇక్కడ గమనించాలి. మాంచాల వంశం పేరు చెప్పినట్టుగా ఈ పదం వాడినా కవి ఉద్దేశం మాంచాల పౌరుషం గల అభిమానవంతురాలని, గారాబంగా పెరిగడం వలన కొంచెం పెంకితనం, ఎదుటివారిని గద్దించగల నేర్పు,(గద్దఱి అంటే దిట్టతనం ఉన్నగలది అని)  ఉన్న పడుచు అని బాలచంద్రుడు గ్రహించాడన్నమాట. అందుకే ఇక్కడ ఇంటిపేరు చెప్పినట్టుగా చెప్తూనే   గండు అనే పదం వాడారు కవి.




"కొమ్మన పలికే కోయిలవనుకుంటి 
కొదమ సింగానివే వయ్యారి - అరుదైన సింగారివే వయ్యారి"

వసంతంలో కోయిల పాటలను వినని వారుండరు. కానీ అది ఎక్కడ ఏ చెట్టుకొమ్మమీద కూర్చుని కుహూ రాగాలను పలికిస్తోందో చూసేదెందరు. ఆకులందు అణగిమణిగి కూసే కోయిలలాంటి అమ్మాయి, అని అనుకున్నాడుట మాంచాల గురించి బాలచంద్రుడు. కానీ తనను ఇంతకాలం మరిచిపోయి, ఇప్పుడు తనను వెతుక్కుంటూ వచ్చావా అని గద్దరించి అడుగుతోంది కాబట్టి ఆమె కోయిలకాదని,  సమయం చూసుకొని మాటువేసి దాడిచేసే కొదమసింగం లాంటి ధైర్యంగల అమ్మాయి అని గ్రహించాను అంటాడు. మాంచాల లో సౌందర్యం, సాహసం కూడా చూసాడు బాలచంద్రుడు. అందుకే అరుదైన సింగారివే వయ్యారి అంటూ స్త్రీలలో అరుదుగా సాహసమూ, సౌందర్యమూ కలబోసిన మూర్తిమంతంగా మాంచాలను చూసాడు బాలచంద్రుడు.






"సిరులేడుగలవారి చినదానా, చివురంటి మనసున్న చినదానా"


 అంటూ తన చెలి మాంచాలను సంబోధిస్తాడు బాలచంద్రుడు. సిరిసంపదలు గలిగిన శ్రీమంతురాలు మాంచాల. ఎన్నో సిరులు కలిగి ఉన్నా, తనపై విరహమనే సుడిగాలిలోచిక్కి,   చిగురాకులా తనప్రేమకోసం అల్లాడుతోందని చివురులాంటి ఆమె లేతమనసుని గ్రహించాడు కనుకే ఆ సంబోధన.


మాంచాల బాలచంద్రుడు తనను సిరిగలదానిగా సంబోధించడం విన్నది. భర్త ప్రేమానురక్తులకోసం పరితపించే భార్య  మాంచాల. బాలచంద్రుడు వివాహం జరిగినా ఇంతకాలం తనకోసం రాలేదు.


ఇక్కడ  పల్నాటి వీరగాథలో ఓ విషయం చెప్పుకోవాలి.  శ్యామాంగి  అనే వేశ్య వ్యామోహంలో పడిన బాలచంద్రుడు భార్య మాంచాలను నిర్ల క్ష్యం చేసాడు. మూడునిద్రలకోసం అత్తగారింటికి వచ్చిన మాంచాల భర్తను చూడకుండానే పుట్టింటికి తిరిగి వెళ్ళిపోయిందట. ఆ బాధ ఆమె మనసులో ఎంత కార్చిర్చులా దహించి వేస్తోందో  ఈ మాటలలో గ్రహిస్తాం.


మాంచాలను కొదమ సింగంతో పోల్చాడు బాలచంద్రుడు. దానికి సమాధానంగా మాంచాల ఇలా అంటుంది.


" కొదమ సింగానికి కోనలో ఒంటరితనమే దీవనా"
 అంటూ. తనకి కొదమసింహంలాంటి సాహసం, తనలో అపురూపమైన శరీరలావణ్యం ఎన్ని ఉన్నా అవి తోడులేక వ్యర్థంగా పడి ఉన్నాయని భావిస్తుంది.


 బాలచంద్రుడు అంటే చంద్రుడు కదా. అతని వెన్నెల కాంతులలో ప్రపంచమంతా పులకరిస్తుంది.  ఇక్కడ నెలరాయడు అంటే చంద్రుడు అనే అర్థంతో పాటు బాలచంద్రుడు అనే అర్థం కూడా వాడారు కవి. బాలచంద్రుడి భార్య అయినా ,   ఆ చల్లని వెన్నెల సోనలు మాంచాలను మాత్రం  తాకడం లేదు.  బాలచంద్రుడి దయ అనే వెన్నెల కాంతి తనకు సోకని కారణంవలన మనసులో వేదన జ్వాలగా దహిస్తోంది.  అందుకే ,


"నెలరాయని ఐదువరాలికి  వెన్నెల సోకని వేదనా"


 అంటూ  ప్రశ్నిస్తుంది." సిరులున్న ఫలమేమి చినవాడా" అంటూ తన సిరిసంపదలన్నీ భర్త ప్రేమకు నోచుకోనినాడు వ్యర్థమే అని ఖచ్చితంగా చెప్తుంది.


మాంచాల మనసును గ్రహించాడు బాలచంద్రుడు. ఆమె తన అనురాగంకోసం ఎంతగా తపిస్తోందో తెలుసుకున్నాడు. ఇంతసేపు  ఆమె ఔద్ధత్యాన్ని, శారీరక లావణ్యాన్ని మాత్రమే గమనించిన బాలచంద్రుడి సంబోధన మారింది.


 "చినదానా, గారాల చినదానా"  అంటూ  తన ప్రేయసిని గారంగా, నయాగారంతో సంబోధించాడు.


"వెనుకటి వెతలు కలలో కథలే,
 మనమేకమై మనమేకమయినాములే" 


  తనకోసం మాంచాల మనసులో పడిన  కలతలు, బాధలు అన్నీ వెనుకటి వెతలే నని ఊరడించాడు. గడిచిపోయిన కాలంలోని బాధలిక ముందు కలగవని హామీ ఇచ్చాడు. అవన్నీ కలలో కథలే అవుతాయని ఆమెకు నచ్చచెప్పాడు.  మనమేకమై, మనమేకమయినాములే అని ముందుజీవితంలో తామందుకోబోయే సుఖజీవనానికి పాదు చేసాడు.


ఇక్కడ "మనమేకమై, మనమేకమయినాము" లో మనము అంటే మనసులు ఏకమై, మనము అంటే తామిద్దరూ ఏకమయ్యాము అంటూ పదచమత్కారం చేసారు కవి.


భర్త బాలచంద్రుడు తన అనురాగాన్ని గుర్తించాడని తెలిసాక మాంచాలకి ఎంతో సంతోషం కలిగింది. 


"పున్నమిలాగా నీవురాగా  మన్ననగా  ఈ కన్నెతనమే 
 హారతినిచ్చేను చినవాడా, ఆదమరిచేను చినవాడా "- 
చీకటినిండిన తన జీవితంలో పున్నమిచంద్రుడిలా వచ్చి కాంతినింపినందుకు కృతజ్ఞతగా తన మనసును శరీరాన్ని కూడా అతని ప్రేమకు గౌరవంగా, హారతి ఇచ్చి అతనిలో కరిగిపోదామనుకుంటుంది.  అతని ప్రేమలో ఇన్నాళ్ళూ తాను అనుభవించిన బాధలన్నీ మరిచిపోయి సేదదీరాలనుకుంటుంది. ఆదమరిచి అతని చేతులలో ఒదిగిపోతుంది.


చక్కని చందమామ వెలుగులో సాగిన  ఈ గీతం, మాంచాల పాత్రలో జమున, బాలచంద్రుడి పాత్రలో హరనాథ్ ల పైన   చిత్రించబడింది.


గొప్ప చారిత్రాత్మక పాత్రలు మాంచాల, బాలచంద్రులు. ఆ దంపతుల  మధ్య   ఎంతో ఎడబాటు తర్వాత కలిసినప్పుడు   ఆ సందర్భం ఎలా ఉంటుందో , అతి చక్కగా ఊహించడం, వారి  మనసులోని భావాలను సంభాషణాత్మకంగా వ్యక్తం చేయడం కవి గొప్పదనమైతే-


అత్యంత సాహసం, లేత చంద్రునిలోని నాజూకైన సౌందర్యం కూడా నింపుకున్న బాలచంద్రుడి పాత్రలో హరనాధ్,  అత్యంత మనోహరమైన రూపురేఖా విలాసాలతో బాహ్య సౌందర్యమే కాక, నిబ్బరమయిన సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోగల మనోధైర్యంగల స్త్రీగా,  భర్త ఆదరణకోసం, ప్రేమానురాగాల కోసం తపించే అర్థాంగిగా మాంచాల పాత్రలో జమున ఈ గీతానికి నిజంగా ప్రాణం పోసారు.


ఈ సాహిత్యానికి రసాలూరు సాలూరు వారు శ్రీ రాజేశ్వరరావు సమకూర్చిన బాణీ కూడా చాలా విశిష్టంగా వినిపిస్తుంది. చాలా అరుదుగా వినబడే సంగీతసాహిత్యాలు కలబోసిన ఈ గీతాన్ని సుశీల తోపాటు ఆలపించినవారు,
మంగళంపల్లి బాల మురళీ కృష్ణగారు కావడం ఈ గీతానికి మరో  ప్రత్యేకతను సంతరించింది. ఆయన గొంతులో వినిపించే ఆ మాధుర్యం, లాలిత్యం బాలచంద్రుడి పాత్రకు జీవం పోసింది.


ఈచక్కని యుగళగీతాన్ని ఇక్కడ వినడంతో పాటు చూసి ఆనందించండి.




చిత్రం           పల్నాటి యుద్ధం


గీతరచన      సముద్రాల రాఘవాచార్య లేదా వెంపటి సదాశివబ్రహ్మం
                (సముద్రాలగారి జీవిత విశేషాల పుస్తకం జీవితమే 
                సఫలము) లో ఇచ్చిన లిస్టులో ఈ పాటను ఆయన 
                రచించినట్టుగాలేదు.

                 వెంపటి సదాశివబ్రహ్మం ఈ సిని్మాకి డైలాగులు రాసారని 
                 వికిపిడియా చెప్తోంది)


సంగీతరచన    సాలూరు రాజేశ్వరరావు


చిత్రదర్శకుడు   గుత్తారామినీడు


చిత్రనిర్మాణం -1966, అన్నపూర్ణా పిక్చర్స్.




























Tuesday, February 7, 2012

రానంతసేపూ విరహమూ, రాగానే కలహమూ ..ప్రణయంలో ఇది సహజమూ!!



చూపులకన్నా ఎదురు చూపులే తీయనా  అన్నాడో సినీకవి. మనం ఎదురు చూస్తున్నవాళ్లు ఎదురై వచ్చాక ఈ వాక్యం మనకు మధురంగా వినిపిస్తుందేమో కానీ నిజంగా ప్రేయసి కోసం ప్రియుడు కానీ, ప్రియతముడి కోసం ప్రేయసి కానీ  కాచుకుని ఉన్నప్పుడు  ఆ ఎదురు చూపులు    అనేవి  ఎంత దుస్సహమో   అనుభజ్ఞులకే           ఎరుక.


ప్రణయం లో కలయిక కన్నా కలుసుకోబోతున్న ఆనందమే ప్రేమైక జీవులకు చాలా ఉద్వేగ భరితంగా ఉంటుంది.
ప్రేమికులు ఏకాంతాన్ని ఇష్టపడతారు కనుక  వారిద్దరికే తెలిసిన సంకేత స్థలంలో   కలుసుకోవడం అనేది కూడా  సహజం. ఇక అనుకున్న సమయానికి వారు రాకపోతే కలిగే    వారిలో కలిగే  భావాలు చాలా మిశ్రమంగా ఉంటాయి.


రానంతసేపూ విరహంతో అలమటించినా  ప్రేయసి లేదా ప్రియుడు ఎదురుపడగానే అంతసేపూ వారికోసం తాము ఎంతో ఎదురుచూసామన్న విషయాన్ని మరచి,  తమకోసం వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేయరు సరికదా వారితో కలహం పెట్టుకుంటారు.


ఇలాంటి గిల్లికజ్జాలు ప్రణయంలో మాధుర్యాన్ని మరింత చిక్కన చేస్తాయి. ప్రణయ కథలలో ఇటువంటి సన్నివేశాలు సృష్టించే సందర్భంలో నాయికా నాయకుల మధ్య సంభాషణలను ఒక్కో కవి ఒక్కోరకంగా చిత్రిస్తారు. ఆయా కవుల రచయితల నైపుణ్యాలను బట్టి  ఆ పాత్ర స్వభావాలు, రూపురేఖా విలాసాలు వెల్లడవుతాయి.


మన సినీగీతాలలో ఈ ఎదురుచూపులు ఘట్టాలు చాలా సినిమాలలో కనిపిస్తాయి. అలాంటి ఓ సందర్భంలో శ్రీ శ్రీ గారు రాసిన ఈ గీతం ఎంతో హృద్యంగా వీనులవిందుగా ఉంటుంది.


నాయకుడు, నాయిక ఎప్పటి లాగే ఒక సంకేత స్థలంలో కలుసుకుందామనుకుంటారు.  అనుకున్న సమయానికి  అమ్మాయి వచ్చి అబ్బాయి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఎంతసేపయినా అతని కోసం ఎదురుచూపే మిగులుతుంది కానీ అతను  ఇంతకీ రాడు, అంతకీ రాడు.


ఇక ఆశలన్నీ నిరాశ అయ్యాయి అమ్మాయికి. అతను రాడేమో తను అతనికోసం ఎదురుచూస్తూ చేసిన కాలం అంతా వృథా అనుకుంది.  కానీ ఇంతలోనే       మబ్బులచాటునుండి కనువిందు చేస్తూ చిక్కని చీకటిలో చందమామలా   ఆ అబ్బాయి  ప్రత్యక్షం అయ్యాడు.

రాననుకున్నావేమో...ఇక రాననుకున్నావేమో
ఆడిన మాటకు నిలిచే వాడను కాననుకున్నావేమో   ఏమో.


అంటూ  తనకోసం ఆమె ఎదురు చూస్తుందని అందుకే   ఇచ్చిన మాట   ప్రకారమే ఆమెకోసం వచ్చానని  చెప్తాడు.


ఇంతసేపూ ఒంటరిగా అతని కోసం ఎదురుచూసిన ఆమె  ఒక్కసారిగా   పులకరించిన  మనసు తో  అతనిని   ఎదుర్కొని చేరుదామనుకుంది.     కానీ అంతలోనే     స్త్రీ  సహజమయిన  భావాలు ఆమెని నిలువరించాయి.
 ఈ అమ్మాయి చాలా స్వాభిమానం గల అమ్మాయి. ఇంతసేపు  అతని కోసం ఎదురుచూస్తూ ఉన్న తాను  అతనిని చూసిన వెంటనే తన బాధని మర్చిపోయి చెంతకు  చేరితే చులకన అయిపోతాననుకుంది. అందుకనే ఇక బెట్టుచేయడం ప్రారంభించింది.


ఏమనుకున్నా రేమో...తమరేమనుకున్నారేమో
మీ చేతులలలో కీలు బొమ్మలం మేమనుకున్నారేమో ....ఏమో.


తాను అతనిని ఎంతో గాఢంగా ప్రేమిస్తే అతనా విషయాన్ని గమనించకుండా ఆమెని నిర్లక్ష్యం చేస్తున్నాడని అనుకుంది. అతను  ప్రేమ అనే సూత్రంతో కీలుబొమ్మను చేసి ఆడించ దలిచాడేమో అని , తాను అటువంటి తేలికైన వ్యక్తిని కానని తన వ్యక్తిత్వాన్ని తెలిపే ప్రయత్నం చేసింది.


ఇక చెప్పిన సమయానికి రాకపోవడం తన తప్పే కనుక ఆమె కోపాన్ని తగ్గించి  సుముఖురాలిని చేసుకునే పనిలో పడ్డాడు అబ్బాయి.


చక్కని కన్యకు ముక్కున కోపం నీకేలా నీకేలా  అంటూ   ఆమె సొగసును వర్ణించే పనిలో పడ్డాడు.  అందమైన ఆమె రూపం తనపై నున్న కోపం వలన వన్నె తగ్గిపోతోందని, ముక్కుమీద కోపం తగ్గించుకుని,  ఆమె కోసం వచ్చిన తనతో చల్లని, చక్కని వాతావరణంలో చల చల్లగా,  హాయి హాయిగా కులాసాగా గడుపుదామని చేర           రమ్మని పిలుస్తాడు.


కానీ ఆమెది  పిలిచిన కొద్దీ కరిగిపోయే తత్వం కాక, మరింత బిగుసుకునే    తత్వం   కనుక అతని ఆహ్వానం ఆమెలో సంతోషం కలిగించదు. పిలిచిన వెంటనే వెళ్తే అతను తనను చులకన చేస్తాడని అనుమానం ఎదలో పొడసూపుతుంది.   అందుకే-


పిలిచిన వెంటనే  పరుగున చెంతనే చేరాలా ....చేరాలా

 అంటూ అతను తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని తెలిసి కూడా ఎందుకు అతని చెంతకు చేరాలని ప్రశ్నిస్తుంది.


పైగా అతనిలో తనపై గల చులకన భావానికి, తనను నిర్లక్ష్యం చేయడానికి కారణం  అతని పై గల ఆ ప్రేమను అతనికి తెలిసేలే ప్రవర్తించడమే కదా అనుకుంటుంది. వనిత తనంతట తా వలచి వచ్చిన చుల్కన కాదే ఏరికిన్ అని వరూధిని ప్రేమికురాళ్ళకు ఏనాడో హితబోధ చేసి పెట్టింది. అది తెలుసేమో ఈ అమ్మాయికి.
వలచి వచ్చి నే చులకనైతిగా ఈ వేళా ఈ వేళా...అంటూ తనని తనే నిందించుకుంటుంది.


అందుకే  అతని పైగల తన అంతులేని ప్రేమను అడ్డు పెట్టుకుని తనను కీలుబొమ్మను చేసి ఆడించాలనుకుంటే  అది కుదరదని మరో సారి హెచ్చరిస్తుంది.


అతను ఇంక  జవాబు చెప్పలేదు. కానీ స్త్రీ సహజమయిన ఆసక్తి ఆమె ఇక దాచు కోలేక పోయింది. తనను కలుసుకోవడానికి వస్తానని చెప్పి, చెప్పిన సమయానికి రాకపోవడానికి గల కారణం ఏమిటో   తెలుసుకోవాలనే కోరిక     ఆమె లోని   బెట్టును  అధిగమించింది.


కానీ  ఆమె  బేల కాదు అందుకే  సూటిగా అడగకుండా సూటి పోటి మాటలతో    ప్రశ్నల బాణాలను సంధించే తన నేర్పును ప్రదర్శించింది.


దొరగారేదో తొందర పనిలో మునిగారా మునిగారా
అందుచేతనే అయిన వారినే మరిచారా మరిచారా 


అంటూ అతను  ఏ రాచకార్యాలు చక్కబెడుతూ తనని మరిచిపోయాడో చెప్పమని అడుగుతుంది.
ఇక్కడ దొరగారు అనే పదం వాడకం   ఆమె అతన్ని మహారాజులు రాచకార్యాలలో మునిగిపోయినప్పుడు  అంతఃపుర కాంతలను ఎలా నిర్లక్ష్యం చేస్తారో అలా అతను తనను మరిచి పోయి పనిలో పడ్డాడని ఊహిస్తుంది. అతనికి తనకన్నా ముఖ్యమైన అంశమేదీ అతని జీవితంలో ఉండడం ఆమెకి నచ్చదని,  అతను తనతోనే కాలక్షేపం చెయ్యాలనే ఆమె బలమైన కోరిక ఇక్కడ వ్యక్తమవుతుంది.


పొగిడి బులిపించి అలక తీర్చుదామనుకుని చెంతకు వస్తే ఆమె పిలిచిన వెంటనే చేరాలా, నేను కీలు బొమ్మను కాను అంటూ సాధించిన తీరుకు అబ్బాయి మనసు కొంచెం చివుక్కుమన్నట్టుంది.


ఆమె మీద ప్రేమే తప్ప  చులకన భావం లేదని, తన మాట నిలుపుకొని రాలేక పోవడానికి గల కారణం ఏమిటో ముందు అడిగి తెలుసుకోకుండా తన పై ఆమె నిందలు వేస్తోందని బాధ పడ్డాడు. ఎంతగా చేరడానికి ప్రయత్నిస్తే
ఆమె అంతగా తనను చీత్కరిస్తోందని నిరాశ పడ్డాడు. అందుకే -

నిజమే తెలియక నిందలు వేయకు నామీద ..నామీద
 మాట విసురులు మూతి విరుపులు మరియాదా....మరియాదా


అంటూ తనతో ఆమె ప్రవర్తిస్తున్న విధానాన్ని ఆక్షేపిస్తూ,  అలా అంటే తన మనసు ఎంత బాధ పడుతుందో చెప్పాడు.


ఇక్కడ ప్రణయ కలహంలో ముఖ్యమైన ఘట్టం ప్రారంభమైంది. అలకలు, మురిపించుకోవడాలు,  అన్యోన్యంగా తమకు గల ప్రేమను తెలుసుకొని మురిసిపోవడాలు తో ఈ ఘట్టానికి ముగింపు. అతను బ్రతిమాలిన కొద్దీ ఆమె  బిగుసుకుంటూ, అతనిని దూరం చేస్తోంది. ఇక అతనిలోనూ ఓపిక నశించింది. మాటాడక ఊరుకున్నాడు. పీటముడి బిగిస్తే తిరిగి దాన్ని విడదీయడం కష్టమని ఎరిగిన తెలివైన కన్య ఆమె.


క్షణమే యుగమై, మనసే శిలయై నిలిచానే నిలిచానే 


అంటూ  అతనితో  తన ప్రవర్తనను  సమర్థించుకుంది.  అతని రాకకోసం తాను ఎంతగానో ఎదురుచూసానని, చెప్పిన సమయానికి రాకపోవడం వలన కలిగిన భంగపాటు తనలో కలిగించిన నిరాశ వలన అతనితో ఇలా ప్రవర్తించానని అతనిని సముదాయించడం ప్రారంభించింది.


నిన్ను చూడగా యుగము క్షణముగా గడిచేనే గడిచేనే


అబ్బాయికి కూడా అమ్మాయి తన బెట్టు సడలించడంతో సంతోష పడ్డాడు. తాను కూడా ఆమె కలయిక కోసం ఎంతో ఎదురుచూస్తానని చెప్తాడు. ఆమెను చూసి, ఆమెతో  గడిపిన  కాలం - అది
యుగకాలం అయినా  క్షణ కాలంగా గడిచిపోతుందనీ  ఆమెపై గల తన అనురాగాన్ని    వెల్లడిస్తాడు.


ఎడబాటన్నది ఇకపై లేనే లేదని అందామా...అందామా
ఈడుజోడుగా తోడు నీడ గా ఉందామా ...ఉందామా  


అంటూ ఇద్దరూ ఒక బంధంతో కలిసి పోయి ఉంటే ఇక ఏ ఎడబాటూ ఉండదనీ, ఎదురుచూపుల బాధ తప్పుతుందని, ఒకరికొకరు తోడు నీడగా ఉంటూ, ఈడు జోడుగా కలిసిపోయి  లోకంతో మెచ్చుకోలు పొందాలంటూ తమ భావిజీవితాన్ని మధురంగా ఊహిస్తూ తమ ప్రణయ కలహానికి వీడుకోలు పలుకుతారు.


ఈ పాటని శ్రీశ్రీ  ఎంతో చమత్కారంగా రాసారు. పాటని సంభాషణాత్మకంగా రాసారు. ఏమో ఏమో అంటూ అనే పదాలను మొదటి  చరణంలో ఎంతో భావయుక్తంగా వాడారు. మీచేతులలో కీలుబొమ్మలం మేమనుకున్నారా అంటూ ఆమె కూడా ఏమో ఏమో...అనడంతో  సత్యభామలా  స్వాభిమానాన్ని ప్రదర్శించే ఆమె మనస్తత్వాన్ని  చూపించారు శ్రీశ్రీ.
రెండవ చరణంలో   నీకేల,  రావేల , చేరాలా, ఈ వేళ అంటూ వేసిన ప్రాస పదాలు ప్రశ్నార్థకాలు పాత్రల స్వభావాన్ని ప్రవర్తనను రూపు కట్టిస్తాయి. అతని ప్రశ్నలకి ఆమె ప్రశ్నలతోనే జవాబు చెప్పి ఆ ప్రశ్నలోనే తన జవాబును చెప్తుంది.


తరువాత  రెండు చరణాలలోను కూడా తేలికైన  తేట తెలుగు పదాలతో  ప్రాసను వేస్తూ పాత్రల అభిప్రాయాలను చెప్పిస్తారు.    శ్రీశ్రీ.  ప్రేమలో  విరహంలో ఎదురుచూపులు ఎంతో క్లిష్టమైన దశ. ఆ సమయంలో క్షణాలు యుగాలుగా గడుస్తాయి. ఈ విషయాన్ని చెప్తూ   శ్రీశ్రీ     అమ్మాయితో   మనసే  శిలయై నిలిచాను అనిపించారు. శిల ఎలా ఉంటుంది. ఏ స్పందనా లేనిదే శిల. అతని కోసం ఎదురు చూసి చూసి ఆశా భంగంతో తన మనసు శిలగా మారిపోయిందని అందుకే స్పందన మరిచిపోయిందని,  కారణం తెలుసుకోకుండానే అతనిపై కోపం ప్రదర్శించడానికి కారణం అదేనని సమర్థించుకుంది అమ్మాయి.


చక్కని సంభాషణా శకలంగా   శ్రీశ్రీ   రచించిన ఈ    చిన్న గీతాన్ని ఎంతో చక్కగా   స్వర పరిచి వీనుల విందుగా వినిపించారు ఈ చిత్రానికి పనిచేసిన జంట స్వరరచయితలు సాలూరి రాజేశ్వరరావుగారు, చలపతిరావుగారు.


ఎన్.టి. రామారావు, జమున ఈ పాటను అభినయించిన ప్రేమికులుగా కనిపించి కనులవిందు కూడా చేస్తారు.


కావాలంటే ఈ లంకె చూడండి. పాట మురిపించక పోతే అడగండి.


http://www.youtube.com/watch?v=eRZjxo10YZo

1964 లో విడుదలైన మంచి మనిషి అనే చిత్రంలోనిది ఈ యుగళ గీతం.


ఈ చిత్రంలోనే "ఏమండీ ఇటు చూడండీ, ఒక్కసారి ఇటు చూసారంటే మీ సొమ్మేమీ పోదండీ" అనే   సోలో గీతం కూడా చక్కని      సంభాషణ రీతిలో సాగుతుంది.


అలాగే పీబీ శ్రీనివాస్ అత్యంత మధురంగా గానం చేసిన సూపర్ హిట్ పాట " ఓహో గులాబి బాల అందాల ప్రేమ మాల "  పాట కూడా ఈ చిత్రంలోనిదే.


ఈ చిత్ర దర్శకుడు కె. ప్రత్యగాత్మ.





Sunday, January 15, 2012

కాదా!! అవునా!! ఏమంటారు?!



అవునా కాదా అనే మీమాంస జీవితంలో చాలా సందర్భాలలో మనిషికి ఎదురవుతూ ఉంటుంది. అవును అయితే ఉండే ఫలితం, కాదు అయితే ఉండే ఫలితం ఊహించగలిగితేనే గాని నిర్ణయాలు తీసుకోలేని స్థితి  ఇలాంటి సందర్భాలలో ఉంటుంది.


అలాగే తెలుగు వ్యవహారంలో చాలామందికి " ఏమంటారు" అని ఓ ఊతపదంగా వాడే అలవాటు ఉంటుంది.  తను చెప్పదలచుకున్నది చెప్పి ఊరుకోకుండా దానిమీద ఎదుటి వ్యక్తి అభిప్రాయాన్ని కోరడం అన్నమాట. ఒక్కోసారి ఇలాంటి అలవాటు సంభాషణలో వక్త ఉద్దేశాన్ని తప్పుగా ధ్వనించి ఆ సంభాషణ లో అపశృతులు చోటుచేసుకునే అవకాశం కూడా ఉంటుంది.


ఈ రెండు మాటలను బహు తమాషాగా ప్రయోగిస్తూ  ఓ యుగళగీతంలో సముద్రాల జూనియర్ గారు చేసిన చమత్కారం వీనుల విందుగా ఉంటుంది. 


 ప్రేమ  మూగది అంటారు. అందుకేనేమో ప్రేమికుల మధ్య  అయితే  ఏ భాషా అవసరం లేదు. కళ్ళతోను, శరీర చాలనం తోనూ వారు పరస్పరం సందేశాలిచ్చుకోగలరు.


 ఇక్కడ ఉన్న యువతీయువకులు -వారి మధ్య ప్రేమభావం ఉన్నా  పరస్పరం తెలుపుకోలేదు. అంగీకారాన్ని పొందలేదు. ఇద్దరికీ ఒకరిమీద ఒకరికి ఎంత అభిమానం ఉందో, అంతకుమించిన ఆత్మాభిమానధనులు. అంతకుమించిన  భాషా కోవిదులు. భాషలోని వ్యంగ్యం, చమత్కారం, మాటల పదునూ తెలిసినవారు. మరి ఇటువంటి చక్కని మాట కారుల మధ్య నడిచిన ప్రేమ సంభాషణ ద్వారా ఒకరిని ఒకరు ఎలా తెలుసుకున్నారో  సూటిగా చెప్పకుండానే ఎలా తమ గురించి చెప్పుకున్నారో  ఇక్కడ    చూద్దాం.


అమ్మాయి తనను ప్రేమిస్తోందని కానీ తనతో చెప్పడానికి ఆమె ఇష్టపడడం లేదని, ఆ విషయం చెప్పేయవచ్చు కదా అనుకుంటాడు అబ్బాయి. అందుకే....ఇలా మొదలు పెడతాడు.


ఆమె మనసులో తనగురించే ఆలోచిస్తోందని, తనమీద ఆమెకి ప్రేమకలిగిందని,  అయితే అది అవునో కాదో అనే విషయం  గురించి ఆమె  మనసులో ఏదో వాదన జరుగుతోందని తనకు తెలిసిందంటాడు- అతను. 
 తనపై వలపు లేదని ఇక ఆమె అనలేదని చెప్తూ...ఏమంటారు అని అడుగుతాడు. ఏమంటారు అనడంలోనే ఆమె మనసులో విషయం తనకు తెలిసిపోయిందనే  నమ్మకం ధ్వనిస్తుంది.


కాదా అవునా ఏదని మీరు 
వాదులో ఉన్నారనుకుంటా..
వాదు ఏదయినా వలపు మదిలోన
 లేదనలేరని నేనంటే....ఏమంటారు


అతను,  తన మనసు  అవునూ కాదుల మధ్య ఊగిసలాడడాన్ని గమనించాడని ఆ అమ్మాయికి తెలిసిపోయింది. కానీ అతను తనపై గెలవడం ఇష్టపడదు. అందుకే ఇలా అంటుంది.


పలుకు పస చూపి తెలివి చూపింప తలచారని నేననుకుంటా
తెలివి కలవారు తమరే కారని తెలియుట మేలని నేనంటే...........ఏమంటారు


అబ్బాయి చాలా మాటకారి. తన మాటలచమత్కారంతో తెలివితేటలతో ఆమె గురించి తెలిసినట్టు చెప్తున్నాడు. కానీ అలా    చెప్పడం ఆమెకి నచ్చలేదు. అందుకే పలుకు పస చూపి - అంటే తన మాట  నేర్పరితనంతో, తెలివిగా  తన మనసును తెలుసు కున్నాననుకుంటున్నాడు. తెలివితేటలు అతనికే కాదని, తనకు  కూడా ఉన్నాయని ఆ విషయం అతను తెలుసుకొని మాట్లాడడం మంచిదని అతనికి సలహా చెపుతుంది.



సిగ్గాపలేక మాటాడ లేక 
తగ్గారని నేననుకుంటా
మూగబోయి అనురాగము కన్నుల 
మూగిందని నేనంటే..    ఏమంటారు



తన మీద ఆమెకి చాలా ఇష్టం ఉందని కానీ అది చెప్పడానికి ఆమెకి సిగ్గు అడ్డం వస్తోందని, అందుకే ఏమీ చెప్పలేక మాట్లాడలేకపోతోందని అందుకే తగ్గి ఉంటోందని అంటే మాట్లాడలేకుండా ఉందని అంటాడు అతను. ఏమాటా చెప్పలేక  తన అనురాగం అంతా కళ్ళతోనే ప్రదర్శిస్తోందని,  అదే నిజం  కదా అని అంటూ ఆమెని -  ఏమంటారు అని ప్రశ్నిస్తాడు.


అనుకుని అనుకుని ఆవేశంలో
అవస్థ పడతారనుకుంటా
ఔరా సైయని ఎదట బడితే  దిగ
జారతారని నేనంటే............ఏమంటారు


తనగురించి అతను అలా చెప్పేయడం ఆమెకి అసలు నచ్చలేదు. తన గురించి అతను అనవసరంగా చాలా విషయాలను ఆలోచించి అవస్ధ పడుతున్నాడని ఆ పని మానితే మంచిదని హెచ్చరిస్తుంది. తను సిగ్గుపడుతూ అతనినుంచి దూరంగా ఉండడం వలన బెట్టు చేస్తున్నాడు కానీ  మొహమాటం వదలి తను  అతనిఎదటబడితే  అతనింక దిగజారిపోతాడని,   పైకి   ఎంతో  బెట్టుగా కనిపిస్తున్న అతను, స్త్రీలకి  దూరంగా ఉండలేడని ఆరోపిస్తుంది.




ఈ ఆరోపణాస్త్రం అతనికి తీవ్రంగానే గుచ్చుకుంది. ఆమె తన గురించి అలా అనుకోవడం గురించి బాధ పడినా ఆమెకి తన ప్రేమలోని నిజాయితీని ఇలా  స్పష్టం చేసాడు. 


తారకలే  తమ గతులు తప్పినా
జారిపోనని అనుకుంటా
మారిపోనని నేనంటా.


భూమి, ఆకాశం, సముద్రం, సూర్యచంద్రులు ఇవన్నీ యుగ యుగాలుగా తమ తమ ధర్మాలను నెరవేరుస్తూనే ఉన్నాయి. వేలాది సంవత్సరాలనుండి  ఆకాశంలో తారలైన  సూర్యచంద్రులు   తమ తమ మార్గాలలోనే ప్రయాణం చేస్తున్నారు. వాటి గతిని తప్పడంలేదు. కానీ ఒకవేళ ఆ తారలు  ప్రత్యేకపరిస్థితులలో గతి తప్పినా తను మాత్రం తన మనసు మార్చుకోడని,      స్త్రీల విషయంలో జారిపోనని, తను మానసికంగా ఎంతో స్థిరమైన వాడినేనని తన గురించి తనే అనుకుంటాడు. ఆమాటనే  ఆమెకి మరోసారి చెప్తాడు. ఆమె పై తనకు గల ప్రేమ శాశ్వతమేనని, తనలో మార్పు రాదని హామీ ఇస్తాడు.


తను అతని  గురించి అన్నమాటకు ఆమె కూడా ఒకింత విచారిస్తుంది కాబోలు. తన మాటల వెనక ఉన్న అర్థాన్ని ఇప్పుడు అతనికి స్పష్టంగా ఏ వ్యంగ్యం లేకుండా చెప్తుంది.

మారిపోని మమతైతే కల 
నిజమౌతుందని  అనుకుంటా
కల నిజమౌతుందని అనుకుంటా.


అతనికి తనమీద ఉన్న అనురాగం నిజంగా తారలు గతితప్పినా మారనిది, చెదరనిది అయితే తను ఎంతో అదృష్టవంతురాలినని భావిస్తుంది. ప్రేమ విషయంలో తమ బంధం విషయంలో తన కలలన్నీ నిజమయ్యే తరుణం వచ్చిందని భావిస్తుంది. అతని మమతలు మారనివైతే ఆమె కలలన్నీ  నిజమవుతాయని అంటూ అతనికి సూటిగా తన మనసులోని విషయాన్ని వెల్లడిస్తుంది అమ్మాయి.


సందర్భోచితమైన సాహిత్యం, పాత్ర స్వభావాలను వెల్లడించే విధంగా రాసిన వాక్యాలు ఈ పాటలో కనిపిస్తాయి. 


బెట్టుచేసే అమ్మాయిల గుట్టు తెలుసుకున్న అబ్బాయి ఎంతో చమత్కారంగా "ఏమంటారు" అంటూనే తను అనదలుచుకున్న విషయాలను అనడంలోను,  అమ్మాయి కూడా తన మాటనైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ  మాటకి మాట జవాబు చెప్తూ "ఏమంటారు" అన్న అతని మాటతోనే ఎదుర్కో వడం ఎలా ఉంటుందో  ఇద్దరు మాట నేర్పరులు  పరస్పరం తలపడిన  సంభాషణాత్మకంగా సాగే గేయరచన ఈ పాటలో చూస్తాం.


 భాషా  వ్యవహర్తకి భాషపై ఉండే పట్టును బట్టి వ్యంగ్యం, ధ్వని వంటి అంశాలు, పదప్రయోగాలు, వాక్య విన్యాసాలు సంభాషణలను రక్తి కట్టిస్తాయి. తెలుగు భాషలోని నాజూకైన పదాలను ఒడిసి పట్టి,  ఎదుటి మనిషిని ఎంతో గౌరవంగా సంబోధిస్తూనే ఎంత ధ్వనిగర్భితమైన సంభాషణ చేయవచ్చో చూపిస్తూ సముద్రాల జూనియర్ గారు రచించిన గేయం ఇది. 


ఘంటసాలగారి గొంతులో చిందులు వేసే చిలిపితనం, సుశీల గొంతులో తొణికిసలాడే కలికితనం ఈ పాటలో సముద్రాల జూనియర్ వినిపించిన చక్కని తెలుగుతనం  వెరసి  టీవీరాజుగారి స్వరకల్పనలో కలిసి తెలుగు యుగళగీతాల హారంలో ఓ  మంచి ముత్యంగా మెరిసింది.




ఇక్కడ విని, చూసి ఆనందించండి.






ఈ గీతం రేచుక్క పగటిచుక్క (1959)అనే చలన చిత్రం కోసం టీవీరాజు గారు స్వరపరచినది.


 తెరపైన నాయికా నాయకులు ఎన్.టి.రామారాలు, 'షావుకారు' జానకి ఎంతో చక్కగా అభినయించారు.


 ఈ చిత్ర నిర్మాత కమలాకర కామేశ్వరరావు.