Tuesday, December 27, 2011

చందమామ సావిత్రికి ఓ నూలుపోగు!!

            
 మహానటి సావిత్రి దివ్యస్మృతికి అంకితంగా మహాకవి రాసిన యుగళగీతం-

"వాడిన పూలే వికసించెనే"
మహాకవి శ్రీశ్రీ  సినీగేయాలలో ఓ మణిపూస!!
చావుబతుకులమధ్య ఉన్న  కూతురు కోరిక మేరకు ఓ  అమ్మమ్మగారు కొడుకు కూతురుకి , కూతురు కొడుక్కి పెళ్ళి చేస్తుంది. చాలా చిన్నపిల్ల అవడం వల్ల ఆ పాపకి తనకి ఆ పెళ్ళి జరిగిన గుర్తు కూడా ఉండదు. పెద్దవాళ్ళయ్యాక తెలియకుండానే ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడతారు. మళ్ళీ ఎన్నో అపార్థాలు, పరిస్థితులు ప్రభావం వలన విడిపోవడం జరిగినా ఓరోజు నిజం తెలిసి తను చిన్నప్పుడు తనను పెళ్ళాడిన ఆ బావే, ఇప్పుడు తను ప్రేమించిన ఈ ప్రియుడు అని కథానాయిక  తెలుసుకుని చాలా సంతోషంగా ఉంటుంది.
పాట నేపథ్యం ఇది. ఈ సందర్భానికి  శ్రీశ్రీ గారు రాసిన గేయం ఇది.
వాడిన పూలే వికసించెనే
చెర  వీడిన హృదయాలు పులకించెనే
 కథానాయిక నాయకుడిని ప్రాణ ప్రదంగా ప్రేమించింది. కానీ తనకు చిన్నతనంలోనే వివాహం జరిగిందని తెలిసి హతాశురాలవుతుంది. మరొకరి సొత్తు అయిన తాను తిరిగి అతనిని ఎలా వరించగలదనే ప్రశ్నకు సమాధానం దొరకక ఎంతో మథన పడుతుంది. కానీ ఆ ప్రియుడే చిన్ననాడు తన మెడలో మాంగల్యం ముడివేసినవాడని తెలియగానే ఆమె సంబరం ఆకాశాన్నంటింది. అందుకే అంతవరకు ఆమెలో  పూవుల్లా విరిసి నిరాశలో ముడుచుకుపోయి వాడిపోయిన ఆశలన్నీ తిరిగి వికసించాయి.

వాడిపోయిన తర్వాత పూలు వికసించడం అనేది జరిగే పని కాదు. అది అసాధ్యం. కానీ అటువంటి అసాధ్యం అనుకునే పని ఈ రోజు తన విషయంలో జరిగినందుకు ఆమె ఆశ్చర్యంతో ఇలా అనుకోవడం  పాటకు సందర్భానికి సార్థకమైన ప్రారంభం. పరిస్థితులు తమ చుట్టూ విషమంగా అల్లుకుపోయి బంధం వేయడం వలన ఆ చెరలో ఉండి ఒకరినొకరు చేరుకోలేకపోయారు. ఇప్పుడు ఆ చెర వీడిపోయింది. అందుకే వారి హృదయాలు పులకిస్తున్నాయి.


ఆమె తన మరదలు అని అతనికి ఆమెకంటే ముందే తెలుసు. తన భార్యఅని తెలిసే ఆమెని చేరుకున్నాడు. కానీ కొన్ని పరిస్థితుల వలన ఆమెకు ముందు చెప్పలేకపోయాడు. ఎలాగో ఆమెకు నిజం తెలిసింది. ఇక ఆమెకు దూరంగా ఉండవలసిన అవసరం లేదు. అందువల్ల అతను ఆమెకోసం కన్న   తీయని  కలలన్నీ ఫలించబోయే తరుణం వచ్చిందని అనుకున్నాడు.


వసంత ఋతువు రావడానికి ముందు ఆకులన్నీ రాలిపోతాయి. చెట్లన్నీ మోడయిపోతాయి. కానీ కాలం అక్కడ ఆగిపోదు. నిర్జీవంగా ఉన్న ప్రకృతికి జీవం వస్తుంది. చెట్లన్నీ కొత్త చిగుళ్ళు తొడుక్కుంటాయి. ఈ మార్పులన్నీ చూసి అన్నాళ్ళూ ఎక్కడో నిద్రాణంగా ఉన్న కల కోకిల  మత్తుగా గమ్మత్తుగా నిద్ర లేస్తుంది. అత్యంత శ్రావ్యమైన తన  స్వరాన్ని సవరించుకొని కొత్త పాటలతో  వసంతాగమనాన్ని స్వాగతిస్తుంది.
వసంతానికి ముందున్న ప్రకృతిలాగే  నిరాశా నిస్పృహలతో నిండి, ఆశల ఆకులు రాలి మోడైన హృదయాల స్థితి-ఇక్కడ ప్రేయసీ ప్రియుల మధ్య ఏర్పడిన ఎడబాటును సూచిస్తుంది. ఇప్పుడు ఆ అపార్థాలు తొలగి వసంతంలా పరిస్థితులు చక్కబడి వారిలో  కొత్త ఆశలు చిగురించాయి. అందువలన తన తీయని ఆశలు ఫలిస్తాయని, తమ జీవితంలో రాబోయే వసంతానికి గుర్తుగా ఎలకోయిల  గొంతు సవరించుకుని మధురగీతం పాడుతోందని నాయకుడు ఊహిస్తాడు. 

 వేయిరేకులు విరిసింది జలజం
తీయతేనియ కొసరింది భ్రమరం
లోకమే ఒక ఉద్యాన వనము
లోటులేదిక మనదే సుఖము

మన మనసు చాలా చిత్రమైనది. అది ఏ పరిస్థితిలో ఉంటే మనకు అలాంటి ప్రపంచాన్నే చూపిస్తుంది.  రోజూ మనం    చూసే ప్రకృతే  మనకు ఎన్నో విధాలుగా కనిపిస్తుంది. కథానాయిక మనస్సు ప్రియుని చేరిన సంతోషంలో  ఉంది. అందుకే ఆమెకు ప్రపంచమంతా అనురాగమయమైనదిగా కనిపిస్తోంది. కొలనులో అత్యంత సహజంగా విరిసే కమలం వేయిరేకులుగా విరిసినట్టుగా తమలో విరిసే అనురాగానికి సంకేతంగా భావిస్తోంది.
ఆమె అనురాగం వేయి రేకులు విరిసిన జలజమై ఉంటే అతను పద్మం నుండి తేనెను సంగ్రహించి ఆనందించే భ్రమరమయ్యాడు. భ్రమరానికి, పద్మానికి ఉన్న సంబంధంగా ప్రేయసీ ప్రియుల, స్త్రీపురుషుల అనుబంధాన్ని వర్ణించడం మన ప్రాచీన కావ్య సంప్రదాయం. ఇక్కడ శ్రీశ్రీ గారు దాన్నే ప్రయోగించారు. వారిద్దరూ ఆవిధంగా ఉన్నప్పుడు వారు ఉంటున్న  ఈ లోకం ఓ పెద్ద ఉద్యానవనంలాగా కనిపిస్తోంది లోటులేదిక మనదే సుఖము అన్న వాక్యం -  ఇక తమకు ఏ పరిస్థితులూ అడ్డురావు  అని భావిస్తున్నారని చెప్తుంది.

చిన్ననాటి తన చిన్నారి మరదలు, ఆనాడే ముడిపడిపోయిన తమ బంధంతో భార్య కూడా అయిన  సహచరిని ఇప్పుడు సరదాగా ఆట పట్టిస్తున్నాడు ఆ బావగారైన భర్త.  సరసన కూర్చొని సరస్సులో తమ నీడలు చూసుకుంటూ చిన్ననాటి ముచ్చటలు కలబోసుకుంటూ ఉన్న ఆ తరుణంలో  ఆ బావగారు-
పగలే జాబిలి ఉదయించెనేలా అంటూ ఆమెని ప్రశ్నించాడు. జాబిలి ఉదయించేది సాయంత్రం చీకటి పడే సమయంలో కదా మరి ఈ పగటి సమయంలో ఉదయించిందేం అంటూ  అడిగిన ఆ ప్రశ్నకి ఆమెకి ఉక్రోషం కలిగింది.  తనని ఆటపట్టిస్తున్నాడనే అనుమానంతో.  వగలే చాలును పరిహాసమేలా అంటూ అతనికి జవాబు ఇచ్చింది.


తేటనీటి సరస్సు ఒడ్డున కూర్చుని ఇద్దరూ ఉండగా అతను ఒక్కసారిగా కొలను లోకి తొంగి చూసాడుట. ఆ నీటిపైన ఏర్పడిని తన ప్రేయసి ముఖబింబపు నీడ చంద్రబింబం వలె తోచిందట. పట్ట పగలు చంద్రుడు ఎలా ఉదయించాడా అని ఆశ్చర్యంతో ఉన్న తనకి అది చంద్రబింబం కాదని, తన ప్రేయసి అందాల మోము కొలనులోని తేటనీటిలో చంద్రబింబంలా ప్రకాశించి తనని భ్రమింపచేసిందని అంటాడు.  
తేటనీటను నీ నవ్వు మొగమే
తెలియాడెను నెలరేని వలెనే అంటూ తన భ్రమకి కారణం చెప్తాడు.   ప్రేయసి మరి మారాడగలదా.


జీవితాలకు నేడే వసంతం
చెదరిపోవని ప్రేమాను బంధం
ఆలపించిన ఆనంద గీతం
ఆలకించగ మధురం మధురం


 వారిజీవితాలలో ఎదురుచూస్తూ ఉన్న వసంతం ఆ విధంగా తిరిగి వచ్చింది. వాడిపోయి రాలిపోయిన ఆశలన్నీ కొత్త చివుళ్ళయి మొలకెత్తాయి. ఇరువురి జీవితాలలో ప్రేమానుబంధాలు లతలుగా పెనవేసుకున్న బంధాలయ్యాయి. 
హృదయాలు ఆలపించే మధురమైన ఆనందమయమైన గీతం గా ఇకపైన తమ జీవితం ఉండబోతోంది.  ఆ గీతాన్ని ఆలకిస్తూ ఉంటే మనసునిండా మాధుర్యం పొంగుతోంది. అదీ - ప్రస్తుతం వారి పరిస్థితి.



ఎంచక్కని  ఎంతో తేలికైన తేట తెలుగు పదాలు, పాత్రల  మానసిక స్థితికి ప్రతీకలుగా వాడుకున్న కవిసమయాలు, వాక్యాలతో చేయించే లయవిన్యాసాలు, తూగుటుయ్యాలలూగించే పద ప్రయోగాలు,  ఆది ప్రాసలు, అంత్యప్రాసలు అలంకార ప్రయోగాలు అన్నీ సమపాళ్ళలో కుదిరిన చక్కని యుగళగీతం.


 

మాంగల్యబలం చిత్రంకోసం శ్రీశ్రీ రచించిన ఈ గీతం అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి జంటపై చిత్రీకరించబడింది.
తేటనీటను తేలియాడగల ముఖచంద్రబింబం ఆ సావిత్రిది కాక మరెవరిది??

చిత్రం :                మాంగల్యబలం 
                       (అగ్నిపరీక్ష అనే బెంగాలీ చిత్రం(1959)ఆధారంగా)
సంగీత దర్శకత్వం    మాష్టర్ వేణు
చిత్ర దర్శకుడు        ఆదుర్తి సుబ్బారావు
గాయనీ గాయకులు   ఘంటసాల, సుశీల



11 comments:

Dr.Suryanarayana Vulimiri said...

సుధారాణి గారు, అలనాటి అందమైన చిత్రాలనుండి మరపురాని మధుర గీతాల్ని ఎన్నుకుని చక్కని విశ్లేషణ చేస్తునారు. ధన్యవాదాలు.

Unknown said...

చక్కని యుగళగీతం...మరింత చక్కని విశ్లేషణ...."తేటనీటను తేలియాడగల ముఖచంద్రబింబం ఆ సావిత్రిది కాక మరెవరిది..." వండర్‌ఫుల్...

Anonymous said...

పూలు వికసించడం కాదది.
మనసునలా పోల్చారు.
అది ప్రతీక.

బాగుంది...చక్కగా రాసారు.
సందర్భంలో ఐక్యమై రాసినట్టుగా ఉంది.

రాజ్ కుమార్ said...

సూపరండీ..చాలా బాగా రాశారు..

buddhamurali said...

బాగా రాశారు . సినిమా పాటలో ఇంత చక్కని తెలుగు పదాలు ఉంటాయని ఈ తరం వారికి గుర్తు చేసేవి ఇలాంటి పాటలే . భాషలో మంచి పట్టున్న వారే ఆ కాలం లో పాటలు రాశారు . ఇప్పుడు తెలుగు రాక పోయినా తెలుగు పాటలు రాయవచ్చు ..

Anonymous said...

ఏది తల్లీ తేట నీరు ? ఎక్కడున్నది నాటి సౌరు?
తేలి యాడిన చంద్ర బింబపు తీరులేమై పోయెనో!
వేణు-శ్రీ శ్రీ కలసి కట్టిన పాట వింటే నిజంగా
వాడి పోయిన పూవు మారును పారిజాతంగా..

-ఓలేటి శ్రీనివాస భాను

Sudha Rani Pantula said...

@సూర్యనారాయణగారు,
@చిన్ని ఆశ గారు,
@ రాజ్ కుమార్ గారు,

పోస్టు నచ్చినందుకు, మెచ్చినందుకు ధన్యవాదాలు.

Sudha Rani Pantula said...

@ఓలేటి శ్రీనివాస భానుగారు,
మీరు చెప్పినది నిజం. ఆనాటి తెలుగు గీతాల తేటనీరు కలుషితమైపోతోంది. తెలుగు పదాలు నిండిన మధురమైన పాటలు వినాలంటే పాత పాటలు వినడమే తప్ప వేరే మార్గం లేదు. అది కూడా చెవుల్లో యంత్రాలు పెట్టుకొనో, గదిలో ఓ మూల కూర్చొనో వినాల్సిన పరిస్థితి.... నవనవోన్మేషంగా వికసించిన పారిజాతపు సౌకుమార్యాన్ని, సౌరుని, సౌరభ్యాన్ని అనుభవించాలంటే ...అలనాటి గీతాలే దారి.
ధన్యవాదాలు.

Sudha Rani Pantula said...

@అనానిమస్,
నిజమే... అక్కడ నా ఉద్దేశం స్పష్టంగా రాలేదేమో మరి.
పూలు వికసించినట్టు ఆమెలో ఆశలు విరిసాయి ఒకప్పుడు. కానీ పరిస్థితుల వలన ఆమెలో ఆశలు వాడిపోయాయి. అలా వాడిపోయిన పూలు తిరిగి వికసించినట్టు భావిస్తోంది. అంటే ఆమెలో ఆశలు మళ్ళీ విరుస్తున్నాయి అని అనుకోవాలి. వాడిన పూలే వికసించెనే అంటోంది కదా. అది బహువచనం కూడా.
మనసు అయితే ఏకవచనం వాడి ఉండేవాడు కవి.

Anonymous said...

దీనర్ధం బహుశ ఇదై ఉండాలి:

ఆమెలో ప్రతికూల భావనలు(నెగటివ్ థాట్స్) చెఱగా.
అనుకూల భావనలు (పాజిటివ్ ధాట్స్ గా) కవి భావించి ఉండవచ్చు.

భావనని మనం బహువచనంలో వాడవచ్చు.
ప్రతికూలమైన భావనలని లేదా పరిస్థితులని మనం చెఱగా చెప్పుకోవచ్చు.

Sudha Rani Pantula said...

అనానిమస్,
మీరు చెప్పిన ఆ వాక్యం నేను రాయనే లేదు. మరిచిపోయాను.
చెరవీడిన హృదయాలు పులకించెనే - అన్నది ఆ వాక్యం. వారిద్దరూ చిక్కుకున్న పరిస్థితులే చెర. అది వీడిపోయింది.
మీరు చెప్పినది బావుంది. థాంక్స్.